ఆదివారం, 25 అక్టోబర్ 2026
Top Advertisement
AP VOICE / విశాఖలో గిరిజన భాషల పరిరక్షణపై సదస్సు.. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణ బృందాలు
విశాఖలో గిరిజన భాషల పరిరక్షణపై సదస్సు.. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణ బృందాలు
AP VOICE
AP VOICE

8 hours ago

విశాఖపట్నం: “అన్ని గిరిజన భాషలూ భారతీయ భాషలే” అనే అంశంపై రెండు రోజుల సెమినార్‌ను అక్టోబర్ 23, 24 తేదీల్లో విశాఖపట్నంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసెంబ్లీ హాల్‌లో నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శక్తి అనే గిరిజన స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించగా, న్యూఢిల్లీలోని భారతీయ భాషా సమితి పూర్తి సహకారం అందించింది.

ఈ సదస్సులో భారతీయ మానవశాస్త్ర సర్వే సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.వి. శర్మ ముఖ్యోపన్యాసం చేశారు. భారతీయ భాషల ప్రోత్సాహం కోసం భారతీయ భాషా సమితి చేపడుతున్న లక్ష్యాలు, కార్యక్రమాల గురించి సీనియర్ నిపుణులు ప్రొఫెసర్ సర్రాజు వివరించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు ముగింపు సమావేశంలో ప్రసంగించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామరాజు ప్రారంభోత్సవ, ముగింపు సమావేశాలకు అధ్యక్షత వహించారు.

గిరిజన భాషల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

తమ తమ గిరిజన భాషల పరిరక్షణ, అభివృద్ధికి విశేష కృషి చేసిన గిరిజన తెగల ప్రతినిధులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో గిరిజన భాషల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జాతపు, కోయ, యానాది, కొండా రెడ్డి, భగత, సవర, కొండదొర, కమ్మర, చెంచు, ఎరుకల, వాల్మీకి తదితర గిరిజన తెగలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.

తమ తమ భాషలను పాఠ్యపుస్తకాల రూపంలో రూపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరో ఐదుగురు గిరిజన ప్రతినిధులు కూడా భాషల అభివృద్ధి దిశగా పనిచేయడానికి ముందుకు వచ్చారు.

గిరిజన భాషలను భవిష్యత్ తరాలకు అందించడం, వాటి పరిరక్షణకు కృషి చేయడం, విద్యా రంగంలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించింది.

సదస్సు సమన్వయకర్తలు: ప్రొఫెసర్ సంధ్యా దీపిక, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ.

Published By : Administrator
AP VOICE LIVE
Advertisement